<no title>ఒక్క కేసు పెట్టకుండా.. 106 రోజుల జైలులో.. మాజీ కేంద్రమంత్రి చిదంబరం

ఒక్క కేసు పెట్టకుండా.. 106 రోజుల జైలులో.. మాజీ కేంద్రమంత్రి చిదంబరం


ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో 106 రోజులపాటు తీహార్ జైలులో గడిపిన కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం బుధవారం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. సీబీఐ అరెస్ట్ చేసిన క్రమంలో ఆగస్టు 21 నుంచి కస్టడీలో ఉన్న ఆయనకు ముగ్గురు జడ్జీలతో కూడిన జస్టిస్ ఆర్ భానుమతి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. తీహార్ జైలు బయట చిదంబరంకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. ఎవరొచ్చారో ఎవరొచ్చారో చూడండి.. పులి బయటకు వచ్చింది.. పులి బయటకు వచ్చింది అంటూ నినాదాలు చేశారు. చిదంబరానికి జైలు సంకెళ్లు తొలిగిపోయాయి అంటూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.


బెయిల్‌పై బయటకు వచ్చిన మీడియాతో చిదంబరం మాట్లాడుతూ.. 106 రోజులు జైలులో పెట్టినా నాపై ఒక్క అభియోగాన్ని మోపలేదు అని అన్నారు. మీడియా ఆయన నుంచి మరింత సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నించగా, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదనే కోర్టు ఆదేశించడంతో ఆయన తదుపరి మాట్లాడానికి నిరాకరించారు.


సుప్రీంకోర్టు నాకు బెయిల్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. 106 రోజుల తర్వాత స్వేచ్ఛావాయువు పీల్చుకొంటున్నాను అని మీడియాతో అన్నారు. చిదంబరంకు బెయిల్ లభించడంపై కాంగ్రెస్ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. చిదంబరంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఆయనను జైలులో పెట్టించింది అని అన్నారు.