భూపాలపల్లి నుంచి ములుగు జిల్లా మీదుగా మణుగూరు వరకు కొత్త కోల్‌కారిడార్ ఏర్పాటుకాబోతున్నది. ఇప్పటికే బొగ్గు గనుల అన్వేషణ విభాగంతో సింగరేణి సంస్థ సర్వే చేయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కోల్‌బెల్ట్ ప్రాంతం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి వరకు అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. భూపాలపల్లి జిల్లా ఘణపురం, ములుగు జిల్లా వెంకటాపురం, ములుగు, పస్రా మండలాల్లో బొగ్గు నిల్వలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం భూపాలపల్లి సమీపంలోని మాధవరావుపల్లిలో ఓసీ-3 ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. సుమారు 30 ఏండ్ల జీవితకాలం గల ఈ గనిపై అధికారులు ఆశలు పెట్టుకున్నారు. ములుగు జిల్లా వెంటాపూర్ మండలంలో ఓసీ-1, ఓసీ-2 ప్రాజెక్టుల ఏర్పాటుకు సైతం లైన్ క్లియర్ అయింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే దాదాపుగా ములుగు కోల్‌బెల్ట్ ఏరియాగా రూపుదిద్దుకున్నట్టే. మాధవరావుపల్లి ఓసీ-3, వెంకటాపూర్ ఓసీ-1, ఓసీ-2 ప్రాజెక్టులు ప్రారంభించిన అనంతరం ములుగు, పస్రా ప్రాజెక్టులపై సింగరేణి అధికారులు దృష్టి సారించనున్నారు.
కొత్త కోల్‌కారిడార్..!