టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహీ మరో కనీసం మరో రెండు మూడేండ్లు ఐపీఎల్ ఆడుతాడని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అతడిలో ఆ సత్తా ఉందని.. ధోనీ ఫిజికల్‌గానే కాక మెంటల్‌గానూ చాలా స్ట్రాంగ్ అని వీవీఎస్ పేర్కొన్నాడు.
`ధోనీ మరో రెండు మూడేండ్లు ఐపీఎల్ ఆడుతాడని భావిస్తున్నా. అతడి ఫిట్‌నెస్ సుప్రీం లెవల్‌లో ఉంది. ఫిట్‌నెస్ అంటే కేవలం శారీరక దారుఢ్యమే కాదు.. మానసికంగానూ మహీ చాలా స్ట్రాంగ్. వయసు అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే. నాయకుడిగా చెన్నై సూపర్ కింగ్స్ ముందుండి నడిపించడం ధోనీకి చాలా ఇష్టం. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ కష్టం కావడంతో ధోనీ ఇక ఆడుతాడా లేదా అని చాలా మంది సందేహ పడుతున్నారు. ఈ ఒక్క ఐపీఎలే కాదు.. రాబోయే రెండు మూడు ఐపీఎల్స్‌లో మహీ కచ్చితంగా ఆడుతాడని నేను చెప్పగలను` అని లక్ష్మణ్ అన్నాడు. అయితే టీమ్ఇండియా తరఫున ఆడే విషయంపై మాత్రం వీవీఎస్ స్పష్టతనివ్వలేదు. బీసీసీఐ కొత్త సెలెక్షన్ కమిటీ ధోనీ భవిష్యత్తు గురించి అతడితోనే చర్చించాలని అన్నాడు.